కడప, పులివెందుల ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్.. 2014 ఎన్నికలు ఫైనల్స్
మూడేళ్లు ఓర్చుకుంటే 30 ఏళ్లు వైఎస్ సువర్ణ పాలన అందిస్తా...
మన జెండా పైనే వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ
ఇది విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవానికి...
కుళ్లు, కుతంత్రాలకు మధ్య పోటీ కాంగ్రెస్‌లో ఎన్నో అవమానాలకు గురిచేశారు
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబాన్ని చీల్చేందుకు తెగించారు
నీచ రాజకీయాలకు పాల్పడ్డారు
ఆత్మగౌరవం చంపుకోలేకబయటకు వచ్చేశా
పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ
కడప, న్యూస్‌లైన్: ‘మరో 45 నుంచి 60 రోజుల్లో మన పార్టీ వస్తుంది. ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా ఇది ఆవిర్భవిస్తుంది. మన పార్టీ జెండాపైనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014 ఎన్నికలు ఫైనల్స్’ అని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. మీరు నాన్నను దీవించినట్లే నన్ను దీవించాలి.. మీ అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఉప్పెనలా పొంగాలి’ అని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. జగన్ మంగళవారం కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో నియోజకవర్గ కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశమయ్యారు. ఉదయం సింహాద్రిపురం, తొండూరు, మధ్యాహ్నం లింగాల, సాయంత్రం వేముల మండలాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట మేరకు తాను ఓదార్పుయాత్ర చేపట్టడం, కాంగ్రెస్ అధిష్టానం వద్దనడం, రకరకాల ఆటంకాలు కల్పించడం, పార్టీకి రాజీనామా చేసే పరిస్థితులు కల్పించడం..చివరకు కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని వివరిస్తూ జగన్ ఆద్యంతం ఉద్వేగభరితంగా మాట్లాడారు.
‘నల్లకాలువ సంతాప సభకు లక్షలాదిమంది గుండెబరువుతో తరలి వచ్చారు. నాన్న మరణాన్ని భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది ఆవేదనతో రోజుల తరబడి అన్నం మానేసి చనిపోయారు. అప్పుడనిపించింది. నాన్న నా ఒక్కడి మనిషే కాదు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్నాడని. నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయాడని. ఆ నల్లకాలువ సభలో నేను మాటిచ్చాను. నాన్న కోసం చనిపోయిన వారి ఇళ్ల తలుపులు తట్టి వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి అండగా ఉంటానని. కానీ అధిష్టానం ఓదార్పు వద్దంది. నేను, భర్త చనిపోయిన బాధలోనూ ఆత్మగౌరవం చంపుకుని అమ్మ.. సోనియా గారి వద్దకెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించాం. అయినా ఆమె మనసు కరగ లేదు. జిల్లాకో సభ పెట్టి అందరినీ అక్కడికి పిలిచి సహాయం చేయమన్నారు. అసలు నాన్న కోసం చనిపోయిన కుటుంబాలు నా సహాయం ఏమైనా అడిగాయా? లేదే?
నాన్న చెప్పినట్లే నడుచుకున్నా..
ఎవరైనా చనిపోతే వారింటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడం.. వారి కష్టసుఖాలు పంచుకోవడం తెలుగింటి సంప్రదాయం. నాన్న కోసం చనిపోయినవారు నా ఆత్మబంధువులని మనసావాచా నమ్మా. అందుకే ముందడుగు వేశా. అప్పుడు కూడా బాగా ఆలోచించా. అప్పుడు నాకు నాన్న నేర్పిన మాట గుర్తొచ్చింది. ‘మాట ఇస్తే కష్టమైనా, నష్టమైనా మడమ తిప్పకుండా ముందుకుపోవాలని. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు.. బతికినన్నాళ్లూ ఎలా బతికామన్నది ముఖ్యమని’. నాన్న చెప్పిన మాట ప్రకారం ఆ బాటలోనే ముందుకు వెళ్లా. యాత్రను సోనియాగారు వద్దన్నప్పుడు నా ముందున్నది రెండే మార్గాలు. సోనియాగాంధీ చెప్పినట్లు..ఇచ్చిన మాటను మరిచి ఆత్మగౌరవం చంపుకుని రాజకీయ భవిష్యత్తు చూసుకోవడం ఒకటైతే.. నాన్న చనిపోయారనే బాధతో గుండె పగిలిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి నేనున్నానని ఓదార్చడం, సచ్ఛీలతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం రెండవది. నేను రెండవ బాటనే ఎంచుకున్నాను. అదే నేరమైంది. నాకు తోడుగా నిలిచినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కష్టనష్టాలకు గురిచేశారు. ఓదార్పులో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. సీఎంలతో, మంత్రులతో చెప్పించారు. వైఎస్ కోసం చనిపోయినవారు, వారి కుటుంబాలు ఓట్లేస్తేనే కదా.. మీరు గెలిచింది అని నేను ఎమ్మెల్యేలను కూడా అడిగా.
అడుగడుగునా అవమానించారు..
అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని అవమానించారు. నా ఇంటిపై, సాక్షిపై పోలీసులతో దాడులు చేయించారు. సొంత పార్టీ వారినే ఉసిగొలిపారు. బీజేపీయో, టీడీపీనో అలా చేస్తే నేను రోడ్డెక్కి ధర్నా చేసేవాడిని. సొంత పార్టీవారే చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. అన్నీ సహించా. చివరకు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా రేపోమాపో జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు అని సమాధానం చెప్పేలా చేశారు. మా కుటుంబాన్ని కూడా చీల్చే కుట్రకు పాల్పడ్డారు. ఎవరి కుటుంబాన్ని వారు చీల్చాలనుకుంది? కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, మండుటెండలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ కుటుంబాన్ని. పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడాలేని విధంగా వినూత్నరీతిలో పథకాలు చేపట్టి రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైన వ్యక్తి కుటుంబాన్ని. అమ్మ సోనియా అపాయింట్‌మెంట్ అడిగితే నెలరోజులు తర్వాత ఇచ్చారు. చిన్నాన్నను ఢిల్లీకి పిలిచి రెండురోజుల్లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించారు. అప్పుడనిపించింది. రాజకీయాల కోసం వీరు ఎంతకైనా తెగిస్తారని.. వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడరని.
విలువలు లేనిచోట ఇమడటం నావల్ల కాదనిపించింది...
కనీస మానవత్వం, విలువలు లేని చోట ఇమడటం నావల్ల కాదనిపించింది. రాజీనామా చేశా. ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రంతో పాటు దేశం చూపు ఉప ఎన్నికలపై ఉంది. మరో 45-60 రోజుల్లో ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా మన పార్టీ వస్తుంది. మనజెండా మీదే ఎన్నికలకు వెళతాం. ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం దశ, దిశ ఎలా మార్చవచ్చో చేసి చూపించిన మహానేత వైఎస్సార్. రామ రాజ్యం నేను చూడలేదు కానీ.. రాజశేఖరుని సువర్ణ రాజ్యం చూశా. వైఎస్ రాజ్యం ఎలా ఉండేదో ఆదినారాయణరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కొందరు చెప్పారు. నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. కానీ మీరు మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. కాంగ్రెస్ పార్టీ పక్కకెళ్లి పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన రాజకీయాలైనా చేయవచ్చు. చిన్నాన్నను పావుగా వాడుకునే కుతంత్రాలకు కూడా దిగొచ్చు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014లో జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఈ ఎన్నికల్లో ఒకవైపు సచ్ఛీలత, విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం నిలబడితే.. మరోవైపు కుళ్లూకుతంత్రం, కుటిల రాజకీయాలు పోటీ పడబోతున్నాయి.
మీ ఆప్యాయత, అనురాగాలు
ఈ పులివెందుల బిడ్డపై ఉప్పొంగాలి
దేవుని దయ, నాన్న ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలే నన్ను రాష్ట్రం వైపు నడిపిస్తాయి. నాన్న కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలెన్నిటినో ఇంకా ఓదార్చాల్సి ఉంది. నేను రాష్ట్రంవైపు చూస్తున్నప్పుడు, జిల్లాల్లో ఉన్నప్పుడు అమ్మ విజయమ్మ పులివెందులలో ఉంటారు. నేను ఎక్కడ ఉన్నా నా గుండె పులివెందులలోనే ఉంటుంది. అక్కగా, మహానేత సతీమణిగా, పేదల ఆడపడుచుగా నియోజకవర్గవాసులు అమ్మను ఆదరించాలి. మీకు ఏ సమస్య వచ్చినా చిన్నాన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, మామ గంగిరెడ్డి లాంటి వారుంటారు. నాన్నను ఏ విధంగా ఆదరించి ఉన్నత స్థాయికి పంపారో, అదే ప్రేమ.. ఆప్యాయతలు ఉప్పెనలా ఈ పులివెందుల బిడ్డపై పొంగాలి. నన్ను దీవించాలి. ప్రతి ఇంటి మీద మన పార్టీ జెండా ఎగరాలి. నన్ను ఆశీర్వదించి పంపండి.’ అని జగన్‌మోహన్‌రెడ్డి వినమ్రంగా కార్యకర్తల హర్షధ్వానాల మధ్య చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె సురేష్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, గ్రామ నాయకులు తరలివచ్చారు.